ఘనంగా సేవాలాల్‌ జయంతి

తన జాతిని ఉద్ధరించడానికి పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ అని రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. ఆదివారం పాంగ్రా గ్రామంలో అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సేవాలాల్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అని ఆయన బోధనలను రామారావు మహరాజ్‌ ద్వారా చెప్పించి తన జాతి ప్రజలతో మార్పు తీసుకురావడానికి కృషి చేశారన్నారు. రామారావు మహరాజ్‌ కూడా తన చివరి రక్తపు బొట్టు వరకు కూడా బంజారాల కోసం కృషి చేస్తున్నారని దవాఖానలో ఉన్న ఆయన ఈ సమాజం కోసం ఇంకా జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని గౌరవించడానికి వారి పండుగలలో వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సేవాలాల్‌ జయంతి అధికారికంగా నిర్వహించాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.  జిల్లాకు గిరిజన భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోటీ మంజూరు చేసిందని, అయితే బంజారా భవనంగా పేరు మార్పించి ఆ కోటీ రూపాయలను తిరిగి మంజూరు చేయించడానికి అదే విధంగా వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం తన నియోజకవర్గానికి మంజూరు చేసే నిధుల్లో మరో రూ. 50లక్షలు కూడా భవన నిర్మాణానికి అందజేస్తానని హామీ ఇచ్చారు.