క‌రోనా ఎక్క‌డ పుట్టిందో తెలియ‌దు: చైనా

 చైనాలోని హుబేయ్ ప్రావిన్సులో ఉన్న వుహాన్ న‌గ‌రం నుంచి నోవెల్ క‌రోనా వైర‌స్ విశ్వ‌వ్యాప్త‌మైన విష‌యం తెలిసిందే. కానీ ఆ ప్రాణాంత‌క వైర‌స్ జ‌న్మ‌స్థానం ఎక్క‌డో చెప్ప‌డం కష్టంగానే ఉన్న‌ది.  ఆ వైర‌స్ జ‌న్యు మూలాల‌ను గుర్తించ‌క ముందే.. దాని గురించి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌డం అవివేక‌మే అవుతుంద‌ని తాజాగా చైనా పేర్కొన్న‌ది.   ఆ దేశానికి చెందిన శ్వాస‌కోస వ్యాధుల నిపుణుడు జాంగ్ నాన్‌షాన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.  నోవెల్ క‌రోనా వైర‌స్ వుహాన్‌లో పుట్టిన విష‌యం వాస్త‌వ‌మే అయినా.. అది అక్క‌డ‌కు ఎలా వ‌చ్చింద‌న్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేద‌ని జాంగ్ అన్నారు. వుహాన్‌లో క‌రోనా తొలి ల‌క్ష‌ణాలు గుర్తించినా.. అది ఆ న‌గ‌రంలోనే పుట్టిన‌ట్లు కాద‌న్నారు. వుహాన్‌లోనే క‌రోనా ఆవిర్భవించిన‌ట్లు ఆధారాలు లేవ‌న్నారు.  ఇది ఓ సైద్ధాంతిక ప్ర‌శ్న అని ఆయ‌న అన్నారు.