శవాన్ని కూడా సొమ్ము చేసుకునే కక్కుర్తిగాళ్లు మన చుట్టూ చాలా మందే ఉంటారు. కరోనా వైరస్‌ను అడ్డం పెట్టుకుని కొంత మంది డబ్బులు సంపాదిస్తున్నారు. నకిలీ శానిటైజర్లు తయారు చేయడం, మాస్క్‌లు, శానిటైజర్లను ఎక్కురేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు దృష్టి సారించారు.
ఇళ్లలోనే ఇష్టమొచ్చినట్లు రకరకాల లిక్విడ్లు కలిపేసి... విదేశీ బ్రాండ్ల లేబుళ్లు తగిలించేసి... అమాయక ప్రజలకు అమ్మి... అడ్డగోలుగా డబ్బు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి శానిటైజర్లను ఎంత రేటు పెట్టి కొనుక్కున్నా వేస్టే... ఇవి వైరస్‌ని చంపలేవు సరికదా... వీటిపై నమ్మకం పెట్టుకుంటే... వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. అందువల్ల నకిలీ హ్యాండ్ శానిటైజర్లు ఎవరు ఎక్కడ అమ్ముతున్నా దేశవ్యాప్తంగా అడ్డుకుంటున్నారు పోలీసులు.
హైదరాబాద్‌లోని పలు చోట్ల మంగళవారం రాచకొండ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బ్రాండెడ్ పేర్లతో నకిలీ శానిటైజర్లు తయారు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ ప్రత్యేక బృందాలు ఒకేసారి వేర్వేరు చోట్ల దాడులు నిర్వహించి
నకిలీ శానిటైజర్ నిల్వలను సీజ్ చేశారు. ఎక్కడైనా ఎవరైనా ఇలాంటి నకిలీ శానిటైజర్లు, మాస్క్‌లు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ కోరారు. కరోనాను సొమ్ము చేసుకుంటున్న ఎటువంటి వారినైనా వదలమని ఆయన చెప్పారు.